- పార్కుస్థలంలో వెలసిన నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహంతో నేలమట్టం
- దేవాలయం కూల్చివేతపై కొనసాగుతున్న సస్పెన్స్
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలయ్యింది. పబ్లిక్ పార్కు స్థలంలో అక్రమంగా అసోసియేషన్ బిల్డింగ్, షెడ్డు, మరియు గుడి నిర్మించినా జీహెచఎంసీ చర్యలు చేపట్టట్లేదంటూ ఈ ఏడాది మార్చిలో సామాజిక కార్యకర్త వినయ్ వంగల రిట్ పిటిషన్ వేసిన విషయం విధితమే. ఐతే విచారణ చేపట్టిన ధర్మాసనం నెలరోజుల్లో చట్టపరమైన చర్యలు చేపట్టి రిపోర్టు ఫైల్ చేయాలని జీహెచఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. నెలలు గడుస్తున్నా చర్యలకు ఉపక్రమించక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై ఆగస్టు నెలలో పిటిషనర్ వినయ్ వంగల కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ క్రమంలో గత నెల 20న బల్దియ అధికారులు సదరు నిర్మాణాలను కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో కాలనీ అసోసియేషన్ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అమలులో ఉన్న కూల్చివేత ఆదేశాల పై ఎటువంటి జోక్యం చేసుకోబోమని తేల్చేసింది.
గురువారం ఈ కోసు విచారణ జరుగగా పిటిషనర్ వాదన వైపే మొగ్గు చూపిన ధర్మాసనం పార్కుస్థలం లో వెలసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది రంగంలోకి దిగారు. గురువారం మాతృశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి చేరుకొని వెంటనే కూల్చివేత మొదలు పెట్టాల్సి ఉందని భవనాన్ని ఖాళీ చేయాలని సూచించారు. దీంతో అదే విషయాన్ని అసోసియేషన్ అడహక్ కమిటీ కాలనీ అంతర్గత వాట్సాప్ గ్రూపులో సమాచారంగా పొందుపరచింది. గత నెలలో షెడ్డును కూల్చేసిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఐతే అదే పార్కు స్థలంలో దేవాలయం సైతం ఉండటంతో అది కూడా కూల్చేస్తారా, వదిలేస్తారా అనే అంశం ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.