నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటితో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో జిహెచ్ ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వల్ల పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి నాల విస్తరణ పనులు చేపడుతామని తెలిపారు. విస్తరణ కు 3 కోట్ల రూపాయల నిధుల ప్రతిపాదనలు పంపామని, మంజూరి కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
జిహెచ్ ఎంసీ ఇంజనీరింగ్ , జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్య పరిసహకారానికి కృషి చేయాలని ఆదేశించారు. వర్షకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్, ఎమర్జెన్సీ టీమ్స్ లు అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఈఈ శ్రీకాంతిని, ఏఈ సునీల్ , చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.