నమస్తే శేరిలింగంపల్లి: ముజఫర్ అహ్మద్ నగర్ చిరు వ్యాపారులకు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఊరట కల్పించింది. మియాపూర్ సర్వేనెంబర్ 100 ఆనుకొని ముజఫర్ అహ్మద్ నగర్ పరిసర ప్రాంతాల్లో 20 సంవత్సరాలుగా కొందరు డబ్బాలు వేసుకొని చిల్లర వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ డబ్బాలను తొలగించాలనీ ప్రయత్నించగా మియాపూర్ వీధి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో అడ్వకేట్ డేవిడ్ పాల్ నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
18వ తేదీన రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం వారికి ఊరట కల్పించింది. చిరువ్యాపరులను తొలగించద్దని, వారిని అక్కడనుండి తొలగించాలని హెచ్ఎండిఏ, సంబంధిత శాఖలు భావిస్తే 2014 వీధి వ్యాపారుల చట్టం ప్రకారం వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలని సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మియాపూర్ వీధి వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ వీధి వ్యాపారులను అక్రమంగా తొలగించాలని చూస్తే మియాపూర్ వీధి వ్యాపారుల సంఘం చూస్తూ ఊరుకోదని వీధి వ్యాపారులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకట చారి యం. ఏ .నగర్ చిరు వ్యాపారులు పాల్గొన్నారు.