మియాపూర్ డివిజన్ లో మఖాం వేసేదెవరు..?

  • ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో సెటిలర్లు
  • కారు జోరు…కమలం చాప కింద నీరు
  • కీలకంగా మారనున్న కాంగ్రెస్, ఎంసిపిఐ (యు) పార్టీల ఓట్ల శాతం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఎక్కువగా నివాసముంటున్నప్రాంతాల్లో మియాపూర్ (108 ) డివిజన్ ప్రధానమైనది. చందానగర్ సర్కిల్ పరిధిలోని 4 డివిజన్లలో మియాపూర్ విస్తీర్ణంలో పెద్దది. తాజా గణాంకాల ప్రకారం ఈ డివిజన్ లో ఓటర్ల సంఖ్య 58165. ఈ ప్రాంతంలో సైతం వందల ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి మణిహారమైన మెట్రో రైల్ డిపో ఈ డివిజన్ లోనే ఉంది. డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్, లక్ష్మి నగర్, ముక్త మహబూబ్ పేట్, మియాపూర్ గ్రామం, న్యూ కాలనీ, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్,టి ఎన్ నగర్, ఓంకార్ నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక మాస్ ఓటర్లు అధికంగా ఉండగా ఎఫ్ సిఐ కాలనీ, వీడియా కాలనీ, చిరంజీవినగర్, బాలాజీ నగర్, జెపి నగర్, మయూరి నగర్, బీకే ఎంక్లేవ్, డీకే ఎంక్లేవ్, జనప్రియ వెస్ట్ సిటీ, శాంతి నగర్, ప్రగతి ఎంక్లేవ్, నీలిమ గ్రీన్స్, దత్తసాయి ఎంక్లేవ్, అరబిందో కాలనీ, శ్రీ రంగాపురం, రెడ్డి ఎంక్లేవ్, కేంద్రీయ విహార్, ప్రశాంత్ నగర్ తదితర కాలనీలలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మియాపూర్ డివిజన్ ముఖ చిత్రం

గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ డివిజన్ లో పోలైన ఓట్లు 20874 కాగా టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మేక రమేష్ 9076 ఓట్లు సాధించి కార్పొరేటర్ గా గెలుపొందాడు. ఈయన సమీప ప్రత్యర్థి ఐన మోహన్ ముదిరాజ్ 8046 ఓట్లతో రెండవ స్థానంలో నిలువగా ఎంసిపిఐ(యూ) పార్టీ నుండి పోటీ చేసిన తాండ్ర కుమార్ 2193 ఓట్లతో మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నాల్గవ స్థానానికి పరిమితం కావడం గమనార్హం.

ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉప్పలపాటి శ్రీకాంత్(టిఆర్ఎస్)

ఉప్పలపాటి శ్రీకాంత్

గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన మాజీ కార్పొరేటర్ మేక రమేష్ అకాల మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ డివిజన్ నుండి డివిజన్ టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. స్థానికంగా జెపిఎన్ నగర్ లో నివాసముండే ఉప్పలపాటి వృత్తి రీత్యా బిల్డరు. దీంతో పాటు పౌల్ట్రీ రంగంలో వ్యాపార వేత్తగా సుపరిచితుడు. కమ్మ సామజిక వర్గానికి చెందిన వాడు కావడంతో స్థానికంగా సొంత సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. శేరిలింగంపల్లి రాజకీయాల్లో కొన్నేళ్లుగా పనిచేస్తూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. కొంత కాలంగా మియాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మియాపూర్ స్థానం నుండి టిఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఎంతోమంది ఆశావహులు పోటీ పడినప్పటికీ చివరగా టికెట్ ఉప్పలపాటినే వరించింది.

కర్లపూడి రాఘవేందర్ రావు (బీజేపీ)

కర్లపూడి రాఘవేందర్ రావు

దీప్తి శ్రీ నగర్ ప్రాంతానికి చెందిన కర్లపూడి రాఘవేందర్ రావు కు శేరిలింగంపల్లి రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది. శేరిలింగంపల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మియాపూర్ ప్రాంతం నుండి బిజెపి కౌన్సిలర్ గా సేవలందించారు. ఈ క్రమంలోనే డివిజన్ లోని చాల కాలనీలలో ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కమ్మ సామాజిక వర్గంలో సైతం ఈయనకు మంచి పట్టు ఉంది. గత జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన రాఘవేందర్ రావు ఇటీవల తిరిగి బీజేపీ నేత మొవ్వ సత్యనారాయణ ప్రోద్బలంతో సొంత గూటికి చేరుకొని పార్టీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసుకున్నాడు. మొవ్వ సత్యనారాయణ అండదండలతో మియాపూర్ ఎన్నికల బరిలో కొనసాగుతున్నాడు.

మహ్మద్ ఇలియాస్ షరీఫ్(కాంగ్రెస్)

మహ్మద్ ఇలియాస్ షరీఫ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ యాకూబ్ షరీఫ్ పటేల్ తనయుడు ఇలియాస్ షరీఫ్. మియాపూర్ గ్రామానికి చెందిన ఇలియాస్ షరీఫ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తూ కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఒకప్పటి యూత్ కాంగ్రెస్ నాయకుడు రవికుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడిగా రాజకీయాల్లో పని చేశాడు. ఈ కారణంగా మియాపూర్ గ్రామంతో పాటు మైనారిటీ వర్గాల్లో మంచి పట్టు సాధించాడు. గత ఎన్నికల్లో ఇలియాజ్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించినప్పటికీ మరో కాంగ్రెస్ నేత రఘుపతి రెడ్డి కారణంగా అవకాశం చేజారి పోయింది. ప్రస్తుతం ఈ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.

పల్లె మురళి గౌడ్ (ఎంసిపిఐ(యూ))

పల్లె మురళి గౌడ్

మియాపూర్ డివిజన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన రాజకీయ పార్టీ ఎంసిపిఐ (యూ). ఈ పార్టీ అభ్యర్థిగా విద్యార్ధి నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ సమీప బంధువు పల్లె మురళి బరిలో నిలిచాడు. డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, టిఎన్ నగర్ తదితర బస్తీల ఏర్పాటులో ఎంసిపిఐ యు పార్టీ కీలక పాత్ర పోషించడంతో ఈ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉంది. గత ఎన్నికల్లో సైతం రెండు వేల పై చిలుకు ఓట్లను ఈ పార్టీ సాధించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యమాలు నడపడంలో ఈ పార్టీ నేతలు ముందుంటారు. మురళి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య(ఏఐఎఫ్ డిఎస్)లో విద్యార్ధి నాయకుడిగా చేరి అనతి కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడి స్థానానికి చేరుకున్నాడు. మియాపూర్ ప్రజల ప్రశ్నించే గొంతుక అనే నినాదంతో, కమ్యూనిస్టు భావజాలంతో ఎన్నికల క్షేత్రంలో అడుగు పెడుతున్నాడు. డివిజన్ నుండి ఈ అభ్యర్థులతో పాటుగా టిడిపి నుండి బొందలపాటి సుధాకర్, స్వతంత్ర అభ్యర్థులుగా తోటీరెడ్డీ సంతోష్ రెడ్డి, కన్నా శ్రీనివాస్ లు పోటీ చేస్తున్నారు.

పోలింగ్ శాతం పైనే అభ్యర్థుల జయాపజయాలు

మియాపూర్ దివంగత కార్పొరేటర్ మేక రమేష్ మృతి అనంతరం డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న ఉప్పలపాటి శ్రీకాంత్ ఈ ప్రాంతపు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాడు. కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల సంక్షేమ సంఘాలతో మమేకమై దీర్ఘ కాలిక సమస్యలకు పరిష్కారం చూపాడు. క్షేత్ర స్థాయిలో గుర్తింపు సాధించి ఎన్నికల ప్రచారంలో సైతం దూసుకుపోతున్నాడు. తనతో పాటు టికెట్ రేసులో ఉన్న డివిజన్ నాయకులందరినీ కలుపుకుని ఎన్నికల శిబిరాన్ని దృఢపరచుకున్నాడు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున మేకరమేష్ ను తెరపైకి తీసుకువచ్చిన మొవ్వ సత్యనారాయణ ఈ ఎన్నికల్లో అదే టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా మారడం గమనార్హం. తన అనుచరుడైన రాఘవేందర్ రావుకు బీజేపీ టికెట్ ఇప్పించి బరిలో నిలబెట్టాడు. మొవ్వ సత్యనారాణయన వ్యూహాలతో బీజేపీ అభ్యర్థి రాఘవేందర్ రావు టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా డివిజన్ లో ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. తాజా పరిస్థితుల ప్రకారం డివిజన్ లో కారు జోరు కొనసాగుతుండగా , కమలం చాప కింద నీరులా విస్తరిస్తోంది. కాగా ఈ డివిజన్ లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది సెటిలర్లే. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలింగ్ కు దూరంగా ఉన్న సెటిలర్లు పరోక్షంగా టిఆర్ఎస్ గెలుపుకు కారణమయ్యారు. కాంగ్రెస్, ఎంసిపిఐ (యూ) పార్టీల అభ్యర్థులు పెద్ద మొత్తంలో మాస్ ఓట్లను చీల్చితే బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారనుంది. ఈ ఎన్నికలో నమోదయ్యే పోలింగ్ శాతం టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here