హైదరాబాద్(నమస్తే శేరిలింగంపల్లి): క్యాన్సర్ మహమ్మారి కారణంగా కుటుంబంలోని వ్యక్తులను కోల్పోవడం బాధాకరణమని, ముందుగా వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని సినీ నటుడు సుమంత్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సుమంత్ హాజరై ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. మెడికవర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరు మాట్లాడుతూ 2018 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 9.6 మిలియన్ల మరణాలకు కారణం క్యాన్సర్ బారిన పడడమేనన్నారు. జీవన శైలిని సవరించడం లేదా కీలక ప్రమాద కారణాలను పరిహరించడం ద్వారా 30శాతం క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చని తెలిపారు. క్యాన్సర్ ప్రమాదాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి, సకాలంలో స్క్రీనింగ్ ద్వారా సంక్లిష్టతను పరిహరించడానికి మరింత అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రేడియేషన్ చీఫ్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్ వినోద్, ఆపరేటింగ్ చీఫ్ నీరజ్‌లాల్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.