మాతృభాషను మరవద్దు: దేవారెడ్డి విజయలక్ష్మి

  • మాదాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మాదాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ (సెంట్రల్) విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి హాజరై ప్రసంగించారు. మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించగలిగితే అన్య భాషల్లో ప్రావీణ్యం సంపాదించడానికి సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న హైదరాబాద్ (సెంట్రల్) విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి

మన భావాలను ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో వ్యక్తపరచడానికి మాతృభాషనే సులువుగా ఉంటుందని అన్నారు. మాతృభాష జాతిఉనికిని, సంస్కృతిని, జాతి జనుల నీతినిజాయితీని, మంచి నడవడికను, జీవన విధానాన్ని నేర్పుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల భాషలు ఉన్నా, కొన్ని వందల భాషలకే విద్యావ్యవస్థలో చోటు దక్కిందని, ప్రపంచవ్యాప్తంగా అనేక మాతృభాషలు అంతర్ధానమయ్యే స్థితిలో ఉన్నాయని, ఆంగ్లభాష ప్రభావానికి లోనైన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు బక్కచిక్కి కనుమరుగైపోయాయన్నారు. ప్రపంచభాషల్లో 230 భాషలు పూర్తిగా అంతరించినట్లు వెల్లడించారు. ఇంకా 3000 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ )నివేదికలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎన్ని భాషలను నేర్చుకున్నా అమ్మ భాషైన మాతృభాషను మరవద్దు అని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవలింగం గారు, అధ్యాపకులు GM స్వామి,G క్రిష్టయ్య ,విద్యార్థినీ విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు ,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here