శేరిలింగంపల్లి, డిసెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో పాటు వైఎస్ జగన్ కలిసి ఉన్న కటౌట్ లు అమరావతి, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, విజయవాడలో వెలిశాయి. సంక్షేమ ప్రధాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలుపుతూ శేరిలింగంపల్లికి చెందిన భారాస సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ వీటిని ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ వర్గాల్లో విపరీంతంగా చర్చ సాగింది. ఈ మధ్య కేటీఆర్, జగన్ సైతం బెంగళూరులో కలవడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, తాడేపల్లి, విజయవాడలో కేసీఆర్, కేటీఆర్, జగన్ కలిసి ఉన్నట్లుగా కటౌట్ లు కనిపించడంతో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, భారాస మధ్య బలమైన దోస్తీ కొనసాగుతుందని చెబుతూ, వచ్చే ఎన్నికల్లో ఇటు కేసీఆర్, అటు జగన్ అధికారంలోకి రాబోతున్నారనే సందేశాన్ని ఇచ్చేలా కటౌట్ లు ఏర్పాటు చేశారు.

పలు చోట్ల కటౌట్ లను ఏర్పాటు చేయకుండా కూటమి నాయకులు, అధికారులు ఇబ్బందులు సృష్టించినా శేరిలింగంపల్లి యువనాయకుడు రవీందర్ యాదవ్ వెనక్కి తగ్గకుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ జగన్ ను ఈ మధ్య రవీందర్ యాదవ్ ప్రతేకంగా కలిసి పలు విషయాలు సైతం చర్చించారు. ఆదివారం జన్మదినోత్సవం సందర్భంగా రవీందర్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేయడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్, వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు సంక్షేమం, అభివృద్ధిలో ముందు ఉండాలంటే కేసీఆర్, వైఎస్ జగన్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సామాన్యుల ధైర్యం కేసీఆర్, వైఎస్ జగన్ అని రవీందర్ యాదవ్ కొనియడారు.





