శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజా షెల్టర్స్ కమిటీ హాల్లో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో 400 మందికి పైగా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని నిపుణులైన వైద్యుల సలహాలు, అవసరమైన మందులు, ఆరోగ్య సూచనలను పొందారు. ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైభవ్ కృష్ణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప మానవతా సేవ అని కొనియాడారు. యలమంచి ఉదయ్ కిరణ్ యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ మియాపూర్ ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కూడా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన వైద్యులు, వాలంటీర్లు, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ విద్య, ఆరోగ్యం, యువజన అభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో పుస్తకాల పంపిణీ, చలివేంద్రాల ఏర్పాటు, అన్నదాన కార్యక్రమాలు, ఉచిత కంటి పరీక్షలు, క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు, వికలాంగులకు సహాయక పరికరాల పంపిణీ, పేద విద్యార్థులకు విద్యా సహాయం, జీహెచ్ఎంసీ కార్మికులకు ఫుడ్ డ్రైవ్‌లు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో గుర్తింపు పొందుతోంది. ఈ కార్యక్రమంలో వీరమల్ల వీరేంద్ర గౌడ్, నడిమింటి కృష్ణ, పట్వారీ శశిధర్, రావిపాటి వెంకటేశ్వర్లు, గోవర్ధన్, సాంబశివరావు, రాజు, రాజన్, శ్రీహరి, మూర్తి, భారత్, పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.





