ప్రపంచ మహాసముద్ర దినోత్సవం: సముద్రాలను కాపాడితేనే మానవాళి భవిష్యత్తు భద్రం – ఆచార్య పి. శ్రీనివాస్

శేరిలింగంప‌ల్లి, జూన్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తారానగర్‌లోని విద్యానికేతన్ మోడల్ హైస్కూల్‌లో ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సముద్రాల పరిరక్షణపై విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ సైన్సెస్ విభాగం ఆచార్యులు పి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ రామాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, భూమి ఉపరితలంలో 71 శాతం భాగాన్ని ఆక్రమించిన మహాసముద్రాలు జీవావరణ సమతుల్యత, వాతావరణ నియంత్రణ, జీవవైవిధ్య పరిరక్షణతోపాటు మానవాళికి అవసరమైన అనేక వనరులను అందిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో మనం పీల్చే ఆక్సిజన్‌లో గణనీయమైన భాగం సముద్రాల నుంచే లభిస్తుందని, కోట్లాది ప్రజలకు ఆహారం, ఉపాధి కూడా సముద్రాలపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం జూన్ 8న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది థీమ్ మనకు తెలిసిన ప్రపంచానికి మించి, మన సముద్రంతో కొత్త సంబంధం: పునఃసమీక్షించడం అని వివరించారు. సముద్రాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, సముద్ర పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సముద్రాలను అందించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ కార్యకలాపాల వల్ల సముద్రాలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు, చమురు లీకేజీలు, మురుగునీరు, వ్యవసాయ వ్యర్థాల కారణంగా సముద్ర జీవ వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటే దాని ప్రభావం మానవ జీవనంపై కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

2030 నాటికి ప్రపంచ దేశాలు కనీసం 30 శాతం సముద్ర ప్రాంతాలను సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని, సముద్రాల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైన విధంగా పారవేయడం, బీచ్ శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనడం, నీటి వనరులను సంరక్షించడం, సముద్ర జీవాలను రక్షించే సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ప్రతి ఒక్కరూ సముద్ర సంరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఒక సముద్రం – ఒక వాతావరణం – ఒక భవిష్యత్తు అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కనకదుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here