ప్రపంచ పర్యావరణ దినోత్సవం: నల్లగండ్లలో మొక్కలు నాటిన ఆరెకపూడి గాంధీ..

శేరిలింగంపల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో ఉన్న విశ్వామిత్ర పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ సృజన, అడిషనల్ కమిషనర్ సుభ‌ద్ర, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డీసీ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఒక ముఖ్యమైన వేదిక అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి వనరుల క్షీణత మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును రక్షిద్దాం, ఒక్క మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారం, ప్రకృతి మన సంపద – పరిరక్షణ మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పరిసరాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించిన ఆయన, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, వాతావరణ మార్పుల ప్రభావాలపై అవగాహన పెంచడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, అలాగే గాలి, నీరు, నేల కాలుష్య నివారణకు కృషి చేయడం అని ఆరెకపూడి గాంధీ వివరించారు.

అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోపాటు ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూబీడీ అధికారి విక్రమ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here