శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో సీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్–2026 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (స్పోర్ట్స్) సుభద్ర, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. చదువు, సంపాదనతోపాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, పీ.వి. సింధు వంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించి శేరిలింగంపల్లి ప్రాంతం, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని గాంధీ సూచించారు. సరైన శిక్షణ, మౌలిక వసతులు కల్పిస్తే పిల్లలు అద్భుత ఫలితాలు సాధించగలరని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అక్బర్ ఖాన్, ఓ. వెంకటేష్, నరేందర్ బల్లా, రాహుల్, పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.






