శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అట్టేపల్లి లక్ష్మీ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, కార్యక్రమ నిర్వాహకుడు అట్టేపల్లి రామప్రభు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ పోలీస్ విభాగానికి చెందిన ఎస్.ఐ. మౌనిక హాజరై మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వినోదాన్ని అందించేందుకు లెమన్ అండ్ స్పూన్, ప్రొటెక్ట్ యువర్ బెలూన్, ఫిల్ ద వాటర్ బాటిల్, టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక ఆటలు నిర్వహించారు.

పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5,000 విలువైన గిఫ్ట్, రెండవ బహుమతిగా రూ.3,000 విలువైన గిఫ్ట్ ప్రకటించారు. అలాగే పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ. మౌనిక మాట్లాడుతూ మహిళలు సమాజానికి శక్తి, కుటుంబానికి బలం అని పేర్కొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ప్రతిభను చూపిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ మహిళలు కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలని, వారి కృషి వల్లనే సమాజం సుస్థిరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాలు, ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి ఎన్క్లేవ్ కాలనీ కమిటీ సభ్యులు, ARP టీమ్ సభ్యులు, కాలనీ మహిళలు, పిల్లలు, నివాసితులు పాల్గొన్నారు.






