శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు, తాము చేస్తున్న పోరాటానికి తమ మద్దతు తెలియజేసి భూములను రక్షించేందుకు సహాకారం అందించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ యూనివర్శీటీకి చెందిన కంచె భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే అక్కడి వైవిధ్యమైన జీవవైవిధ్యం, వృక్షజాలం నశించి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నా ఇప్పటికీ యూనివర్శీటీ భూములను యూనివర్శీటీకి చెందినవిగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ చేయించలేదని వారికి చెందిన భూములను వారికే అప్పజెప్పాలని కోరారు.
నాడు చంద్రబాబు ప్రభుత్వం భారత్ స్పోర్ట్స్ సంస్థకు కేటాయించిన ఈ 400 ఎకరాలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని కానీ నేడు అదే కాంగ్రెస్ మళ్ళీ విక్రయించాలని చూస్తోందని అన్నారు. యూనివర్శీటీలో విక్రయాలు చేయడం లేదని అసెంబ్లీలో మంత్ర శ్రీధర్ బాబు ప్రకటన చేసిన అక్కడ విక్రయించాలనుకుంటున్న భూములకు కనెక్ట్ చేస్తూ టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే నిర్మాణాలు నిలుపుదల చేయాలని అన్నారు. విద్యార్థుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అఖిల భారత స్థాయిలో తమ పార్టీ ఎంపిలతో కేంద్ర మంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్తామని తెలిపారు. విద్యార్థులు వెనక్కి తిరిగి చూడకుండా తమ పోరాటాన్ని భవిష్యత్ తరాలకు ఈ భూములు దక్కేందుకు పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆందోళనను దేశంలోని అన్ని యూనివర్సిటీలకు విస్తరిస్తామని అన్నారు.