మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ తండాకి చెందిన ఈశ్వర్ అనే బాలుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా ఈ విషయాన్ని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన గాంధృ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం అందేలా చూస్తామని, తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి స్వయంగా రూ.10వేలను అందజేశారు. కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్లతో కలిసి ఆయన బాధితులకు సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు సహాయం అందేలా చూస్తామన్నారు. బాధితులు ఏదైనా అవసరం అయితే తమను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, కుమార్ పాల్గొన్నారు.






