శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకు బిఓసి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కన్నవారి కన్యగారి నర్సింహ్మరెడ్డి అన్నారు. గచ్చిబౌలి భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డా దగ్గర జరిగిన సమావేశంలో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం గంటల తరబడి ఎదురుచూసే లేబర్ అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు మంచినీళ్లు టాయిలెట్స్ లేక చాలా అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. భవన నిర్మాణ కార్మికులు పని ప్రదేశాలలో కిందపడి చనిపోయిన గాయాలైన భవన నిర్మాణ యాజమాన్యాలు ఆదుకోవడంలో విఫలమైతున్నాయని ఆయన విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న కార్మికులతో ఈ పనులు చేయిస్తూ ప్రమాదంలో గాయపడిన చనిపోయిన ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి పంపించి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు శంషాబాద్ లో ఏప్రిల్ 21, 22 తేదీలలో జరుగుతున్నాయని వాటిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఓసి శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.