శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రకే కాకుండా భారత దేశంలో కూడా బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ విద్య నేర్చుకోవాలని విద్యతో జ్ఞానం వస్తుందని ప్రపంచ జ్ఞానం సంపాదించిన తర్వాత జీవితమే మారిపోతుందని ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరిచిపోలేనివని అన్నారు. మహిళలకు విద్య అవసరమని ఆయన భావించారని, అందుకనే తన భార్య సావిత్రి బాయి ఫూలేతో కలిసి మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఆర్గనైజ్ సెక్రెటరీ హరికృష్ణ చారి, కార్యదర్శి బట్రాజు సాయినాథ్, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






