శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని శ్రీకాంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాధవరం గోపాల్రావు, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ అధ్యక్షుడు జి. దేవేందర్రావు, వైస్ ప్రెసిడెంట్ సి. విద్యానంద చారి, సెక్రటరీ ఐ. దశరథరావు, జాయింట్ సెక్రటరీ జి. సురేష్, విరూపాక్షయ్య తదితరులు పాల్గొన్నారు.





