శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్‌లోని గోపి చెరువు, చాకలి చెరువుల్లో పెరుగుతున్న గుర్రపు డెక్కను వెంటనే తొలగించి స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేశామని, అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. డివిజన్ పరిధిలోని గోపీనగర్, పాపిరెడ్డి కాలనీ, డోయెన్స్ కాలనీ, నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్ లలో నివాసం ఉంటున్న ప్రజలు ఆ చెరువుల్లోని గుర్రపు డెక్క కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, దోమలు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, కాలనీల్లో దుర్వాసన వస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని, శానిటేషన్, మానిటరింగ్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలని, టైమ్‌బౌండ్ యాక్షన్ ప్లాన్ ను ప్రకటించాలని అన్నారు. జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం సెక్షన్లు 112, 115ల ప్రకారం ప్రజారోగ్యం కాపాడే బాధ్యత అధికారులపై ఉందన్నారు. సెక్షన్ 123 ప్రకారం వ్యర్థాల తొలగింపు తప్పనిసరి అని, సెక్షన్ 461 ప్రకారం నిర్లక్ష్యం పట్ల శిక్షార్హమైన చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ప్రజా ఉద్యమం చేపడతామని, వంటా వార్పు, ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని పొట్ట నరేందర్ యాదవ్ డిమాండ్ చేశారు.






