ఢిల్లీలో ఓటు బచావో – దేశ్ బచావో మహా మార్చ్.. భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, భారత రాజ్యాంగ స్ఫూర్తి సంరక్షణ, ప్రతి పౌరుడి ఓటు హక్కుకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ – ఓటు బచావో, దేశ్ బచావో జాతీయ స్థాయి కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నవంబర్ 1న న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమం, మహా మార్చ్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి రాంలీలా మైదానం వరకు సాగిన మహా మార్చ్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని ఓటు హక్కుల పరిరక్షణకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులు, ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువల సంరక్షణ అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇడుపుగంటి సుబ్బారావు, ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తుళ్లూరు బ్రహ్మయ్య, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, కూన శ్రీశైలం, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ తదితరులను యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదని, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల బలం, గొంతుక, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య సాధనమైన ఓటుకు ప్రతి పౌరుడి విషయంలో సమాన విలువ ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.

యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడి ఓటు హక్కుకు సంపూర్ణ గౌరవం కల్పించాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జాతీయ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నేతలు, పలువురు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఓటు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల అంశాలపై తమ వైఖరిని వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here