శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేటలోని జల మండలి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్రపంచ జల దినోత్సవ అవగాహనపై ముద్రించిన గోడపత్రికను హైదరాబాదు మహానగర జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, ఛీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, 15వ డివిజన్ జనరల్ మేనేజర్ రమావత్ కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రకృతి ప్రసాదించిన నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడటమే అని అన్నారు. ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలి. చెట్లను విరివిగా పెంచాలి అని అన్నారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణతో పాటు ఇతర రసాయనిక పదార్థాలతో కలుషితం కాకుండా కాపాడుకోవడం వంటి చర్యలు చేపట్టాలి. ఇది ప్రభుత్వంతో పాటు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి ఆచరిస్తేనే పర్యావరణ రక్షణతో పాటు సకల జనులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలిపారు. ఈ సందర్భంగా అందరిచేత నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మారబోయిన సదానంద్ యాదవ్, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, G.V. రావు, శివరామరెడ్డి, జనార్ధన్, ఉమా చంద్రశేఖర్, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.






