- వినతి పత్రం అందచేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య.
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ గ్రామంలో గాంధీ బొమ్మ నుండి పోచమ్మ ఆలయం వరకు రెండు లైన్ల రోడ్డు, పోచమ్మ ఆలయం నుండి శ్రీ కృష్ణ ఆలయం వరకు, పోచమ్మ ఆలయం నుండి మల్లన్న స్వామి ఆలయం వరకు ఒక లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చందానగర్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డికి ముద్ధంగుల మల్లేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య వినతి పత్రం అందజేశారు . సుమారు 15 సంవత్సరాల క్రితం నుండి జాప్యం జరుగుతూ వస్తుంది. వివిధ కారణాలతో రోడ్డు నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య , స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముద్దంగుల మల్లేష్ పేర్కొన్నారు.
ప్రజలు మరీ ముఖ్యంగా వాహనదారులకు నిత్యం అవస్థలు తప్పడం లేదన్నారు. ఒకే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించాల్సి రావడం, కొన్నిచోట్ల పనులు జరుగుతున్నా అసంపూర్తిగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే పాఠశాల బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు ట్రాఫిక్ లో నిలిచి ఉన్న కాస్త సమయం వృథా అవుతుందని వాపోయారు. ముఖ్యంగా ఒక మార్గంలో వెళుతున్న వాహనాలకు రోడ్డు మధ్యలో ఎటువంటి ప్రమాదా హెచ్చరికలు లేక ఎందరో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేయడంతోపాటు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా కనీస ఏర్పాట్లు చేయాలని అధికారులకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉప కమిషనర్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకొని, తగిన విధంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పక్కి వెంకటయ్య, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్దల మల్లేష్ , సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.