శేరిలింగంపల్లి, ఫిబ్రవి 11 (నమస్తే శేరిలింగంపల్లి): కానరీ ది స్కూల్‌లో CBSE బోర్డు పరీక్షలకు సంసిద్దమౌతున్న సందర్భంలో 10వ, 12వ తరగతి విద్యార్థుల కోసం ఆశీర్వాద వేడుకను నిర్వహించారు. పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారి భావోద్వేగాల కలయికకు ఒక అద్భుతమైన వేదికగా, ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ అద్భుత ఘట్టం విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. పాఠశాల ప్రిన్సిపల్ లిడియా క్రిస్టినా, హెడ్ సీనియర్ స్కూల్ డాక్టర్ నవీన్ కుమార్ ఇమ్మడి, కోఆర్డినేటర్లు అపర్ణ, ముక్తా, అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం జ్యోతి ప్రజ్జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాబోయే పరీక్షలలో, భవిషత్తులో ఎదురయ్యే సవాళ్లను, సంక్లిష్టతలను అధిగమించడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని, మద్దతును సూచిస్తూ, విద్యార్థుల కొవ్వొత్తులను వెలిగించే వేడుక మరింత శోభను జోడించింది. విద్యార్థులకు తమ లోతైన ఆకాంక్షలను, కోరికలను ఒక శక్తివంతమైన విష్ ట్రీ పై వ్యక్తీకరించే అవకాశం లభించింది. విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీతో తమకు ఈ పాఠశాలతో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులతో గడిపిన అమూల్యమైన అనుబంధాన్ని నెమరువేసుకుంటూ, కొంత వాతావరణం బరువెక్కినప్పటికి, విద్యా ప్రయాణం అనివార్యం కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు కొత్త బాధ్యతలను, సవాళ్లను స్వీకరించడానికి సంసిద్ధులను చేసే దిశగా, ప్రిన్సిపల్ లిడియా క్రిస్టినా వారిలో ప్రేరణ కలిగించడం ఒక కీలకమైన ఘట్టంగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ పిల్లలను తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని, పాఠశాలలో తమ పిల్లలు ఉన్న సమయంలో, తమ పిల్లలను ఎంతో సురక్షితమైన వాతావరణంలో ఉంచామనే భావన తమకు కలిగేదని కొనియాడారు.