శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సీనియర్ పాత్రికేయుడు బి. వెంకటేశ్వర్లు మాతృమూర్తి బి. కృష్ణమ్మ స్మృత్యర్థం ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను కూకట్ పల్లి ప్రెకాస స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కళా పత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలుగు నేల ఉన్నంత కాలం ప్రతి ఇంట, ప్రతి వేదిక, ప్రతి ఆలయంలో ఘంటసాల పాటలు మారుమోగుతూనే ఉంటాయని, ఘంటసాల స్వరం దేవుడిచ్చిన గొప్ప వరం అని, ఘంటసాల పాటలు అజరామరం అని కొనియాడారు. ఘంటసాల పాటలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని, అలసిన మనసును సేద తీరుస్తాయని అన్నారు.

సినీ నేపథ్య గాయకుడు, సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవివర్మ మాట్లాడుతూ ఘంటసాల పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదని, ఘంటసాల పాడిన పాటలు పాడుతూ ఎందరో గాయకులు ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. కళా పత్రిక సంపాదకుడు డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ ఘంటసాల అమర గాయకుడు అని, ఇన్నేళ్లు అయినా ఘంటసాల స్వరాన్ని మించిన స్వరం మరొకటి రాలేదన్నారు. తెలంగాణలో మూడు దశాబ్దాల పాత్రికేయుడిగా తనదైన గుర్తింపు పొంది మంచికి మారుపేరుగా నిలిచిన జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు సేవలను గుర్తించి కళా పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు జర్నలిజం, గానం రెండూ ప్రాణం అన్నారు. ఘంటసాల, బాలు పాటలు ఇష్టమని, అందుకే ప్రత్యేక సమయం కేటాయించి సంగీత విభావరి నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎసిపి కడారు వెంకటరెడ్డి, ఎసిపి వేముల భాస్కర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, సాంఘిక సంక్షేమ శాఖ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సత్యనారాయణ, బిసి సంక్షేమ సంఘం నేత తేళ్ల హరికృష్ణ తదితరులు పాల్గొని ఘంటసాలకు, బి.కృష్ణమ్మకు నివాళులు అర్పించారు. జర్నలిస్ట్ వెంకటేశ్వర్లును అభినందించారు. ప్రెకాస నిర్వాహకులు సబిత మట్ల, ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో గాయకులు రవివర్మ, బి. వెంకటేశ్వర్లు, లాలయ్య, పి.శ్రీనివాసరావు, రాధికాశర్మ తదితర 20 మంది గాయకులతో ఎనిమిది గంటల పాటు జరిగిన ఘంటసాల పాటల విభావరి అలరించింది.





