బీసీల‌ను మోసం చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలి: బీసీ సంఘాల నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీ రిజర్వేషన్లను మంట కలుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప‌డుతున్నామ‌ని బీసీ సంఘాల నాయ‌కులు తెలిపారు. ఈమధ్య ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రెండు కోట్ల మంది బీసీల జీవితాలతో ఆడుకుంటున్నార‌ని అన్నారు. బీసీల‌ను ఆగం చేస్తూ వారిని అగ్నికి ఆహుతి చేస్తున్నట్లుగా ఉంద‌ని, మొత్తం బీసీల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టార‌ని అన్నారు. బీసీల కామారెడ్డి డిక్లరేషన్ అన్నార‌ని, ఆ తర్వాత స్థానిక సంస్థలు విద్యా, ఉద్యోగం వంటి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అన్నారని, కానీ దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించి పోరాడకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లేని పనికిరాని చట్టాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కోర్టుల ముందు పరువు తీసి బీసీల నోట్లో మట్టి కొట్టింద‌ని ఆరోపించారు. బీసీలు 42 శాతం స్థానిక సంస్థల స్థానాల్లో పోటీలో పాల్గొన‌వ‌చ్చు అని బీసీ నాయకులంతా ఆశపడ్డారు అని, కానీ ఆ సీట్లన్నీ ఇప్పుడు ఓసీలకు కేటాయించార‌ని అన్నారు. ఇది నమ్మకద్రోహం కాక మ‌రేమిట‌ని ప్ర‌శ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నవంబర్ 26న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల‌లో అంబేద్కర్ విగ్రహాల వద్ద, కలెక్టరేట్ల ముందు నిరసన ధర్నాలు చేయాలని పిలుపునిస్తున్నామ‌ని, ఈ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి చైర్మన్ ఈశ్వరయ్య, అధ్యక్షుడు చిరంజీవులు, రిటైర్డ్ ఐఎస్ గౌరవ చైర్మన్ విశారదను మహారాజ్ , వర్కింగ్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, దుర్గయ్య గౌడ్, చీమకుర్తి రాజు, కేవి గౌడ్, బైరు శేఖర్, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here