శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): కేవలం 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ తెలంగాణతోపాటు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ ప్రణవ్ మాధవ్ సురపనేనిని రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు. తెలంగాణ సచివాలయంలో ప్రణవ్ తన తల్లిదండ్రులు రఘు, కవితతో పాటు మియాపూర్ డివిజన్ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్, నవ్యశ్రీ, శశితో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రణవ్ సాధించిన విజయాలను మంత్రి శ్రీహరి అభినందిస్తూ, ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. క్రీడల పట్ల ప్రణవ్ చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభ ఆయన విజయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. 2026లో డెహ్రాడూన్లో జరిగిన ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ ఛాంపియన్షిప్ లో ప్రణవ్ సత్తా చాటారు. మూడు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. 1000 మీటర్ల విభాగంలో రజత పతకం, 500 మీటర్ల విభాగంలో కాంస్య పతకం, మెన్స్ రిలేలో కాంస్య పతకం సాధించారు. ఇప్పటికే ప్రణవ్ మల్టిపుల్ టైమ్ నేషనల్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచారు. అంతేకాకుండా వరల్డ్ జూనియర్ కప్స్, వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే సీనియర్ వరల్డ్ టూర్కు కూడా అర్హత సాధించడం విశేషం.
తెలంగాణ నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ వేదిక వరకు ప్రణవ్ సాగిస్తున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీహరి అన్నారు.2030 ఒలింపిక్స్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ప్రణవ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన అవకాశాలు, ప్రోత్సాహం, సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రణవ్ వంటి యువ ప్రతిభావంతులు తెలంగాణ క్రీడా రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.





