శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించారు. మాదాపూర్, ఇజ్జత్ నగర్, చంద్రనాయక్ తండా, ధోభీ ఘాట్, జూబ్లీ గార్డెన్, హనుమాన్ నగర్, వసంత సిటీ, అరబిందో కోహినూర్ అపార్ట్మెంట్స్, సంకల్ప్ అపార్ట్మెంట్స్, కృష్ణ కాలనీల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భక్తితో పాటు ప్రకృతి పట్ల బాధ్యతను కలిగి ఉండాలని సూచించారు. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణహితమైన పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం కారణంగా చెరువులు కలుషితమయ్యే అవకాశం ఉందని గాంధీ పేర్కొన్నారు. చెరువులను కాలుష్యం నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. వినాయక పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వినాయక మండపాల వద్ద భద్రతా చర్యలు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు కూడా నిబంధనలు పాటిస్తూ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






