శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎన్క్లేవ్, జనప్రియ వెస్ట్ సిటీ, బీకే ఎన్క్లేవ్, సుభాష్ చంద్రబోస్ నగర్, న్యూ కాలనీ, ఆర్బీఆర్, ఎఫ్‌సీఐ, స్టాలిన్ నగర్ కాలనీల్లోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. సీనియర్ నాయకుడు బండారు మోహన్ ముదిరాజ్, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని శ్రీకాంత్ సూచించారు. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. భక్తితోపాటు ప్రకృతి పట్ల బాధ్యత కలిగి ఉండడం ప్రతి ఒక్కరి ధర్మమని అన్నారు. వినాయక చవితి సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల చెరువులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. చెరువులను కాలుష్యం నుంచి కాపాడుకోవడం, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





