శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీ ప్రసిద్ధమైనదని, ఈరోజున దేశవ్యాప్తంగా చేతివృత్తులవారు, హస్తకళాకారులు విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నారని, ఇదే రోజు హైదరాబాద్ సంస్థానం నిజం క్రూరపాలన, రజాకార్ల అరాచకాల నుండి విముక్తి పొందిందని, సరిగ్గా ఈ రోజే తన జీవితాన్ని దేశ సేవకు, ప్రజాసేవకు అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం కావడం మనందరి అదృష్టంగా భావించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు , నియోజకవర్గ ఇన్చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు నియోజవర్గంలో కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్, బంజారా బస్తీలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ని స్మరించుకుంటూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నిజాం కబంద హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన దినోత్సవం గా జరుపుకుంటామని తెలిపారు. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటి హైదరాబాద్ సంస్థానం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తనను తాను స్వతంత్రుడిగా ప్రకటించుకుని భారతదేశంలో కలవకుండా పరిపాలన కొనసాగించాడన్నారు. నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న అరాచకాలకు ముగింపు పలకాలని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరిట సెప్టెంబర్ 13 న భారత సైన్యంతో హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టించి హైదరాబాద్ ను భారత్లో విలీనం అయ్యేలా చేశారన్నారు.సెప్టెంబర్ 17 నాడు నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాబడిందని, అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ కురుమ , రాధాకృష్ణ యాదవ్, అరవింద్, ఆంజనేయులు సాగర్, మహేష్ యాదవ్, పద్మ, సరోజ రెడ్డి, మేరీ, రవి నాయక్, సంజీవ్, సురేష్ యాదవ్, ఆత్మరావ్, పవన్ పాల్గొన్నారు.





