శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేక వైఖరి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలతో మరోమారు బయటపడిందని టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ విమర్శించారు. పార్లమెంట్ లో తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా చందానగర్ లో కాంగ్రెస్ నాయకుడు కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో సామల్ కార్తీక్ పాల్గొని మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అంటూ గతంలో బీజేపీ అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వాటికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానిస్తూ భారత పార్లమెంట్ లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశాయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావాన్ని మతపరమైన అంశాల ఆధారంగా ఏర్పడిన దాయాది దేశం పాకిస్థాన్ విభజనతో ముడి పెట్టడం బిజెపికి తెలంగాణ పట్ల ఉన్న వ్యతిరేకతను సూచిస్తోందని అన్నారు.

దేశంలో మతం, కులం, ప్రాంతం ఆధారితంగా విభజన రాజకీయం చేస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి తీసుకొని రాకుండా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతుంటే ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు మౌనంగా చూస్తూ ఉండడం బానిసత్వానికి నిదర్శనమన్నారు. వెంటనే బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు , సమాజాం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, తేజస్వీ సూర్యను పార్లమెంట్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, సమన్వయకర్త రఘునందన్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ రఘుపతి రెడ్డి, సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






