శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఎం ఎ నగర్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న తాండ్ర కుమార్ విగ్రహం వద్ద ఆయన నాలుగో వర్ధంతిని విజయవంతం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన యం సి పి ఐ (యు ) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) యం సి పి ఐ (యు ) రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొంది నాలుగు సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివి. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్ల స్థలాల స్వాధీన పోరాటంలో అనేక నిర్బంధాలకు గురయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం తప్పుడు కేసులను, కర్కశమైన పోలీస్ దమనకాండను ఎదుర్కొన్నారు. నిలువ నీడలేని అణగారిన ప్రజలకు నీడ కల్పించడం కోసం సాగిన తాండ్ర కుమార్ పోరాట జీవితంలో 42 అక్రమ కేసులు పెట్టారని, అనేకసార్లు జైలు జీవితాన్ని, నిర్బంధాలను ఎదుర్కొన్నారని అన్నారు. తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతిని 2026 ఫిబ్రవరి 14న ప్రస్తుత రాజకీయాలు- ప్రజల కర్తవ్యం అనే అంశంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సదస్సులు వివిధ రూపాలలో కార్యక్రమాలను నిర్వహించనున్నామని, అందులో భాగంగానే మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న తాండ్ర కుమార్ భారీ స్తూపం నుండి ఆల్విన్ కాలనీ, పోలీస్ స్టేషన్ రోడ్, కుషినగర్ మీదుగా ఎం ఎ నగర్ వరకు జరిగే ర్యాలీ-సభలో ప్రజలు ప్రజాతంత్ర వాదులు, వామపక్ష శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యం సి పి ఐ (యు ) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, మధుసూదన్, మియాపూర్ డివిజన్ నాయకులు జి శివాని, వి అనిత, ఎండి మౌలానా తదితరులు పాల్గొన్నారు.






