నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు నాటకరంగంలో పరిచయం అక్కరలేనిది సురబి నాటక సమాజమని ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి పేర్కొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణా ప్రభుత్వం, సురభి కళాక్షేత్రం నిర్వహించబోతున్న 45 రోజుల నట శిక్షణా శిభిరం పోస్టర్ ను ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, కళాబంధు మామిడి హరిక్రిష్ణ , శిక్షణ శిబిరం నిర్వాహకులు డా. రమేష్ సింధే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటకాన్ని వృత్తి గా చేసుకుని కళామతల్లికి సేవచేస్తూ, నాటక కళను రక్షిస్తూ 136 సంవత్సరాలుగా తెలుగు నాట కొనసాగుతున్న ఏకైక వృత్తి నాటక సమాజమని అన్నారు. నాటకరంగానికి సాంకేతిక పరమైన హంగులతో అతిమనోహరంగా చూపించడంలో సురభి కళాకారులే సాటి అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సురభి నాటక రంగం క్షీణించి పోతుందని, నాటక కళకు ఆదరణ తగ్గడంతో నాటకాన్ని వృత్తి గానే కాదు ప్రవృత్తిగా కూడా తీసుకునే స్థితిలో నేటి సురభి యువతరం లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు సురభిని పుస్తకాలలో చదువుకునే పరిస్థితి రావచ్చని చెప్పారు. అలా కాకూడదని సురభిని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి పరిస్తితుల నుంచి బయట పడాలంటే సరికొత్త పద్దతులను, సరికొత్త ప్రదర్శనా రీతులను తెలుసుకుంటే సురభి సమాజంతో పాటు సురభి కుటుంబ సభ్యులు కూడా కొంత బతకగలుగుతారని అన్నారు.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సురభి కుటుంబ సభ్యుడు, రంగస్థల కళల్లో పిహెచ్‌డి పూర్తి చేసిన డా.రమేష్ సింధే తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సహకారంతో సురభి యువత కోసం ప్రత్యేకంగా 45 రోజుల పాటు నట శిక్షణ తరగతులను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఈ వర్క్ షాప్ వల్ల సురభి యువత సంప్రదాయ నాటక పద్దతులతో పాటు, ఆధునిక నాటక, నటన పద్దతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకవైపు నాటకానికి సంబందించిన నటనపరమైన పరిజ్ఞానాన్ని పొందడమే కాకుండా , సినిమా టీవి రంగాలలోనూ నటులుగా ఎదిగేందుకు కొంత అవకాశం ఉంటుందన్నారు. అందుకోసం తెలుగు నాటకరంగంలో నిపుణులైన కొందరు నటులు, నట శిక్షకులతో నాటకానికి సంబందించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రేడియో, టివి, సినిమా రంగానికి చెందిన రేడియో జాకీలు, సినిమా దర్శకులు, నటులు, మొదలైన వారితో ఆయా మాధ్యమాలలో ఏ విధంగా నటించాలి అనే వాటిపై ప్రత్యేక క్లాసులు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ వర్క్ షాప్ నిర్వహణకు సహకరిస్తున్న సురభి యువసేన వారికి, అవేటి మనోహర్ సురభి కళామందిరం వారికి, సురభికాలనీవాసుల సంక్షేమ సంఘం వారికి డా. రమేష్ సింధే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వర్క్ షాప్ ప్రారంభోత్సవ సభలో పద్మశ్రీ ఆర్. నాగేశ్వరరావు, రఘునాథ్, పూర్ణచంద్రశేఖర్, నటశిక్షకులు నటరాజ్ మూర్తి, డా.ఖాజాపాషా, సాయి పట్టెపు, సురభి సంతోష్, శిక్షణా శిబిరానికి హజరయ్యే సురభి యువత పాల్గొన్నారు.