శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హాజరై కొండా విజయ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి కొండా విజయ్ కుమార్ను శాలువాతో సత్కరించిన గాంధీ.. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. కొండా విజయ్ కుమార్ సామాజిక బాధ్యతతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. సమాజ హితం కోసం ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరంతో పాటు అన్నదానం నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. శిబిరంలో సుమారు 115 మంది రక్తదానం చేయడం అభినందనీయమని గాంధీ పేర్కొన్నారు. రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అని గాంధీ పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా సాటి మనిషి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలని కోరారు. తలసేమియా బాధితులు, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రతిరోజూ రక్తం అవసరం ఉంటుందని, రక్తం కోసం ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒకరు చేసే రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడగలదన్నారు.

ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, ఇతర వస్తువులను పునరుత్పత్తి చేసుకోవచ్చుగానీ రక్తాన్ని మాత్రం మరొకరు దానం చేయడం ద్వారానే పొందగలమని గాంధీ అన్నారు. రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






