శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్‌నగర్ డివిజన్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఎల్‌వీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం జరిగిన ఈ టోర్నమెంట్‌లో స్థానిక క్రీడాకారులు, అకాడమీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో క్రీడాకారులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు విభాగాల్లో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరి పాయింట్ వరకు నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన పోరులో చందు నరహరి అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. అనంతరం నిర్వాహకులు చందు నరహరికి ప్రథమ బహుమతితో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య స్నేహభావం, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. పండుగల సందర్భంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా సమాజంలో సోదరభావం మరింత పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా ప్రోత్సాహకులు విష్ణు యాదవ్, డాక్టర్ సురేందర్, అజయ్ చింతల, రామ్, నవీన్, ప్రవీణ్, ఆర్కే, సుధాకర్, సాయి, నరేష్, రమేష్, నాగరాజు యాదవ్, సురేంద్ర, దరియా, కిషోర్, బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొని విజేతకు శుభాకాంక్షలు తెలిపారు.





