శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమం ఈ వారం భక్తి, సంగీతం, నాట్యంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఏలూరుకు చెందిన అభినయ నృత్యభారతి ఆధ్వర్యంలో నాట్యాచార్య డి. హేమసుందర్ మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. నర్తకులు వి. కృష్ణ శ్రీమయి, వి. మిహిర ప్రేమమయి, ఆర్. మేఘన, ఎం. పూజిత, కె. రిషి ప్రియ, ఎం. దేదీప్య, కె. తన్విక, పి. సాయి సహస్ర, ఆర్. హేత్విక, పి. రుత్విక నందన, డి.ఎస్.ఎస్. తేజస్వి, వి. హంసిని, డి. లాస్య శ్రీ, ఎం. లీక్షిత, కె. సత్య శ్రీవల్లి, పి. బావజ్ఞ పాల్గొని శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి నృత్య కైంకర్యం సమర్పించారు.

ఈ సందర్భంగా భజమానస విఘ్నేశ్వర వందనం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, వినరో భాగ్యము విష్ణు కథ, అలరులు కురియగా ఆడెనదే అలివేలు మంగ, దశావతార శబ్దం, ముద్దుగారే యశోద, అంజనీ సుతుడు ఆర్చించిన పాదములు, భావములోన, అదిగో అల్లదిగో, బ్రహ్మమొక్కటే తదితర నృత్యాంశాలను భావ, లయ, అభినయ సమన్వయంతో ప్రదర్శించారు. నృత్య ప్రదర్శనకు ఎన్. రామారావు మేకప్, డి. రూపేష్ చంద్ర వస్త్రాలంకరణలో సహకరించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నమయ్యపురానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీయ, విజయ ఆధ్వర్యంలో అన్నమ స్వరార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విఘ్నరాజం, కనకధారా స్తవం, చాలదా హరినామ, వందే వాసుదేవం, ఇందరికీ అభయంబు, అన్ని మంత్రములు ఇందే, విన్నపాలు వినవలె, చక్కని తల్లికి, కాలభైరవాష్టకం, బ్రహ్మ కడిగిన పాదము, శరణు శరణు, రామ కోదండ రామ, శ్రీమన్నారాయణ, ఫాలనేత్రానల తదితర భక్తిరసభరితమైన కీర్తనలను ఆలపించారు. స్వరార్చనకు స్వరూప్ తబలాపై, శాస్త్రి కీబోర్డుపై వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం ముగింపులో సాయంత్రం 7 గంటలకు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి అంగనలీరే మంగళహారతి సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.





