శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.2 కోట్ల 84 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మయూరి నగర్, అభయాంజనేయ కాలనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్–హైటెన్షన్ లైన్ రోడ్డు, శ్రీల గార్డెన్ కాలనీల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం, ఓపెన్ జిమ్‌లు, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని గాంధీ అన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఆరోగ్యకరమైన శేరిలింగంపల్లి తన ధ్యేయమని గాంధీ పేర్కొన్నారు. ప్రతి కాలనీ, పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా ప్రజలు ప్రతిరోజూ వ్యాయామం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వృద్ధులు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు చిన్నారుల కోసం ఆటవిడుపు పరికరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మయూరి నగర్ కోరుకొండ కోచింగ్ సెంటర్ సమీపంలోని పార్కులో రూ.60.50 లక్షలతో సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్ నిర్మాణం, అభయాంజనేయ కాలనీలో రూ.23 లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణం, శ్రీల గార్డెన్ కాలనీలో రూ.46 లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్–బొల్లారం రోడ్డు నుంచి హైటెన్షన్ లైన్ రోడ్డు మీదుగా కొకనట్ గ్రూవ్స్ అపార్ట్మెంట్స్ వరకు రూ.1.55 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు..
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గాంధీ పునరుద్ఘాటించారు. మియాపూర్ డివిజన్‌తో పాటు మొత్తం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





