శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిర్రా రవీందర్ యాదవ్ చేపట్టిన సీడ్ గణపతి కార్యక్రమానికి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్‌ను కలిసి పర్యావరణహితంగా రూపొందించిన సీడ్ గణపతి విగ్రహాన్ని రవీందర్ యాదవ్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ గణపతి విగ్రహాల్లో విత్తనాలను పొందుపరిచారు. నిమజ్జనం అనంతరం విగ్రహంలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదిగేలా వీటిని రూపొందించారు. భక్తితో వినాయకుడిని పూజించడంతోపాటు ప్రకృతిని పరిరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోందని సీపీ ఎం. రమేష్ కొనియాడారు.

సీడ్ గణపతి కార్యక్రమాన్ని సీపీ అభినందిస్తూ.. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ భక్తితో గణపతిని పూజిద్దాం.. బాధ్యతతో ప్రకృతిని కాపాడుదాం అని పిలుపునిచ్చారు. పండుగల సందర్భంగా పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కోరారు.





