ఓజోన్ పొర‌ను ప‌రిర‌క్షించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాలి: ప్రొఫెస‌ర్ జి.కిశోర్ కుమార్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఈ సృష్టిలో సమస్త జీవకోటికి జీవాధారం ఓజోన్ అని ఆచార్య G. కిషోర్ కుమార్ అన్నారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యవంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్‌సీయూలోని సెంటర్ ఫర్ ఎర్త్, ఏషియన్ అండ్ ఎట్మాస్ఫియర్ సైన్సెస్ ఆచార్య G. కిషోర్ కుమార్ హాజ‌రై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఓజోన్ పొర ప్రాముఖ్యత, దానిని రక్షించ వలసిన ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నార‌ని అన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్రొఫెస‌ర్ కిశోర్ కుమార్

ఈ సంవత్సరం వాతావరణ చర్యను అభివృద్ధి చేయటం అనే నినాదంతో నిర్వహిస్తున్నార‌ని తెలిపారు. ఈ సృష్టి మొత్తం కూడా ఓజోన్ పొర పైనే ఆధారపడి ఉంది కాబట్టి ఓజోన్ ను రక్షించుకోవాలంటే చెట్లను పెంచాలి. అలాగే అడవుల నరికివేతను అడ్డుకోవాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ ల వాడకాన్ని నిషేధించాలి. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. పంటలలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులను పరిమితంగా వాడుకొని పర్యావరణాన్ని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌చే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌పై ప్ర‌తిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ D. విజయభాస్కర్, వైస్ ప్రిన్సిపాల్ మిత్రి, అధ్యాపకుడు శ్రీనివాసరావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల‌చే ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌తిజ్ఞ చేయిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here