శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పా ఫ్లె ఓవర్ రెండో దశ నిర్మాణ పనులలో మరింత వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు. స్లాబ్‌లు సహా అనుసంధానమైన పనులు జాప్యం లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని గచ్చిబౌలి ఫ్లె ఓవర్ నిర్మాణ పనులను జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి , ప్రాజెక్టు అధికారులతో కలిసి కమీషనర్ ఇలంబర్తి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లె ఓవర్ నిర్మాణ పనుల పురోగతితో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణం, ఆస్థుల సేకరణ అంశాలను జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి కమీషనర్‌కు వివరించారు. హెచ్‌ఎండబ్ల్యుఎస్ బ్యాలెన్స్ యుటిలిటీ షిఫ్ట్ కు చర్యలు తీసుకోవాలని సదరు విభాగంతో సమన్వయం చేస్తున్నట్లు, పూర్తి కాగానే సర్వీస్ రోడ్డు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేస్తామని జడ్‌సీ తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ పియర్స్ క్యాప్, డెక్ స్లాబ్ కాస్టింగ్ నిర్మాణ పనుల వేగం చేయాలని, సర్వీసు రోడ్డు పనులకు ఆటంకంగా ఉన్న ఆస్థుల సేకరణను చేపట్టాలని ఆదేశించారు. గచ్బిబౌలి కూడలిని మరింత విస్తరించటం ద్వారా ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దాలన్నారు. రహదారి విస్తరణలో అడ్డుగా ఉన్న కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యాన్మాయ ఏర్పాటు చేయాలని కమీషనర్ స్పష్టం చేసారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీఈ దేవానంద్, డీసీ ముకుందారెడ్డి, సీపీ శ్యాంకుమార్, రోడ్ వైడనింగ్ అధికారి రవీందర్, ఏసీపీ వెంకటరమణ,ఈఈ మల్లిఖార్జున్, ఇతర అధికారులు పాల్గొన్నారు.