చందానగర్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ.. ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ..

శేరిలింగంప‌ల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంలో భాగంగా చందానగర్ పరిధిలోని వేముకుంట, తారాన్ నగర్ ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ నెం. 65, 119 పరిధిలో ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. క‌చ్చితమైన, సమగ్రమైన, తాజా సమాచారంతో కూడిన ఓటరు జాబితాను రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా BLOలు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడంతోపాటు, వాటిని సక్రమంగా పూరించేందుకు ఓటర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు బూత్ లెవల్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతోపాటు నిర్ణీత గడువులోగా సమర్పించాలని కోరారు.

అలాగే ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయించుకోవాలని, పేరు, చిరునామా, వయస్సు లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే వాటిని BLOల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తప్పులు లేని, సమగ్ర ఓటరు జాబితా తయారీలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్న AERO, BLOలు ఇంటింటికీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here