- ఆవిష్కరించిన సీపీ వీసీ సజ్జనార్
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులపై పలువురు రూపొందించిన పాటల సీడీని సైబరాబాద్ కమిషరేట్ కార్యాలయంలో సోమవారం సీపీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సేవలను గుర్తిస్తూ వారి కోసం ఈ పాటను రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ పాటను రూపొందించిన వారిని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వోటీ ఏడీసీపీ సందీప్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, జాయింట్ సెక్రటరీ ఫర్ ట్రాఫిక్ ఫోరం వెంకట్ టంకశాల, పాట రూపకర్త తిప్పని పరశురామరెడ్డి, రఘువీర్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఐటీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలువెత్తున ఎగిసే కెరటం లా.. నీతిని కాపాడే ధైర్యంలా.. జనం వెంటే ఉంటాడు ఈ పోలీస్ పేరిట సాగే ఆ పాటను తిప్పని పరశురామ రెడ్డి రూపొందించగా, కృష్ణం రాజు సాంకేతిక సహకారం అందించారు. సతీష్ సాధన్ సంగీత దర్శకత్వం వహించగా, స్వరాగ్ కీర్తన్ పాటను ఆలపించారు. పాటను లోకేష్ రచించగా, బాజీ కీబోర్డు అందించారు. మస్తాన్ రికార్డు చేశారు. ఈ బృందం మొత్తాన్ని సీపీ సజ్జనార్ అభినందించారు.