మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా సందర్శకులు శిల్పారామంలో సందడి చేశారు. ఈ సందర్బంగా శిల్పారామంలో గంగిరెద్దుల విన్యాసాలు, డూడూ బసవన్నల ఆట పాట, హరిదాసుల కీర్తనలు సందర్శకులను అలరించాయి. అలాగే బుడబుక్కల వారు, జంగమదేవరులు, పిట్టలదొరలు తమ మాటలతో సందర్శకులను అలరించారు. అనంతరం శిల్పారామం యాంఫీ థియేటర్‌లో డాక్టర్ గౌతమి రవిచంద్ర శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. మార్గశిర మాస ప్రదర్శన నృత్య రూపకాన్ని గోదా కౌతం, హరిహర వాసం, అష్టలక్ష్మి, భావయామి రఘురామం వంటి అంశాలను ప్రదర్శించారు.