శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): పిల్లలకు మరింత సురక్షితమైన, సమగ్ర, అనుకూలమైన నగరంగా సైబరాబాద్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), యూనిసెఫ్ ఇండియా సంయుక్తంగా ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. సీఎంసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్ సిటిజన్స్: ఎ చైల్డ్-ఫ్రెండ్లీ అండ్ సేఫ్ సైబరాబాద్ అంశంపై జరిగిన సమావేశంలో బాలలు, కిశోరుల అవసరాలు, అభిప్రాయాలను నగర ప్రణాళికలో భాగం చేయడంపై చర్చించారు. సీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. సృజన చైల్డ్-ఫ్రెండ్లీ, సేఫ్ సైబరాబాద్ కోసం రూపొందిస్తున్న దృష్టికోణం, ప్రతిపాదిత కార్యాచరణ విధానాన్ని వివరించారు. పిల్లలు, కిశోరులను జూనియర్ సిటిజన్స్ గా గుర్తిస్తూ నగర అభివృద్ధి, ప్రణాళికలో వారి అవసరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకునేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.


వీధులు, పార్కులు, పాఠశాలలు, ప్రజా ప్రదేశాలు, రవాణా, ప్రాథమిక పౌర సేవలు, భద్రత తదితర అంశాల్లో పిల్లలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ప్రతిపాదిత జూనియర్ సిటిజన్స్ కార్యక్రమంలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో పిల్లలతో క్రమబద్ధమైన సంప్రదింపులు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. పాఠశాలలకు సురక్షిత మార్గాలు, పాదచారుల మౌలిక వసతులు, పార్కులు, ప్రజా ప్రదేశాలు, నీరు–పారిశుధ్యం, రవాణా, కమ్యూనిటీ భద్రత వంటి అంశాలపై పిల్లల సూచనలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పిల్లల భాగస్వామ్యాన్ని ఒక్కసారి నిర్వహించే కార్యక్రమంగా కాకుండా నిరంతర సంస్థాగత ప్రక్రియగా కొనసాగించాల్సిన అవసరాన్ని కమిషనర్ వివరించారు. పిల్లల నుంచి సేకరించిన సూచనలను జూనియర్ సిటిజన్స్ చార్టర్ ఆఫ్ ఆస్క్స్ రూపంలో రూపొందించి, వాటిని వార్డు ప్రణాళికలు, బడ్జెట్ ప్రతిపాదనలు, వివిధ శాఖల కార్యాచరణ ప్రణాళికల్లో పరిగణనలోకి తీసుకునే విధానాన్ని ప్రతిపాదించారు.

అలాగే, పిల్లల సూచనల ఆధారంగా తీసుకున్న చర్యలపై వారికి తిరిగి సమాచారం అందించే విధానాన్ని కూడా కార్యక్రమంలో భాగం చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా సీఎంసీ ప్రధాన కార్యాలయంలో చైల్డ్ రైట్స్ సెక్రటేరియట్ సెల్‌ను కమిషనర్, సీఎంసీ, యూనిసెఫ్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. సైబరాబాద్‌లో బాలల హక్కులు, చైల్డ్-ఫ్రెండ్లీ పట్టణ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరం సమన్వయం చేయడానికి ఈ సెల్ సంస్థాగత వేదికగా పనిచేయనుంది. పిల్లల భాగస్వామ్యం, సమగ్రత, భద్రత, పారదర్శకతతో పాటు సీఎంసీ శాఖలు, పాఠశాలలు, కుటుంబాలు, కమ్యూనిటీ సంస్థల మధ్య సమన్వయానికి సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చారు. పట్టణ ప్రణాళిక, పార్కులు–ప్రజా ప్రదేశాలు, రవాణా, పౌర సేవలు, పాఠశాలలు, భద్రత వంటి అంశాల్లో చైల్డ్ ఇంపాక్ట్‌ను పరిగణనలోకి తీసుకునే విధానంపై దృష్టి సారించారు.
ఈ సమావేశానికి యూనిసెఫ్ ఇండియా డిప్యూటీ రిప్రజెంటేటివ్ (ప్రోగ్రామ్స్) జెస్పర్ మోలర్, చీఫ్ ఆఫ్ ఫీల్డ్ సర్వీసెస్ సోలెడాడ్ హెర్రెరో, యూనిసెఫ్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డాక్టర్ జెలాలెమ్ బి. టాఫెస్సే, చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోనీకుట్టి జార్జ్‌తో పాటు సీఎంసీ అదనపు కమిషనర్ వి.వి.ఎల్. సుభద్రా దేవి, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ శాఖల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.





