శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్–నిజాంపేట్ రోడ్డుకు చెందిన కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, గ్రాండ్ మాస్టర్ డా. టి. గోపీ కృష్ణ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక రికార్డు ప్రయత్నంలో పాల్గొని అరుదైన ఘనత సాధించారు. మార్షల్ ఆర్ట్స్‌లో తన ప్రతిభను చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఏప్రిల్ 26న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అధికారిక రికార్డు ప్రయత్నంలో సీనియర్ మాస్టర్స్ విభాగంలో కేవలం 20 నిమిషాల్లో 40 సార్లు కరాటే కటాను ప్రదర్శించారు. ఈ రికార్డు ప్రయత్నానికి సంబంధించిన సర్టిఫికెట్, పతకాన్ని సెప్టెంబర్ నాలుగో వారంలో అందుకున్నారు.

ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ డా. టి. గోపీ కృష్ణ కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ జి. విజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రయత్నానికి సంబంధించిన సర్టిఫికెట్, పతకాన్ని సీఐకి చూపించారు. డా. గోపీ కృష్ణ సాధించిన ఘనతను సీఐ విజయ్ కుమార్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మార్షల్ ఆర్ట్స్ రంగంలో డా. గోపీ కృష్ణ అందిస్తున్న సేవలు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక రికార్డు ప్రయత్నంలో ఆయన భాగస్వామ్యం యువతకు, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసకులకు స్ఫూర్తిదాయకమని సీఐ విజయ్ కుమార్ అన్నారు. కఠోర సాధన, పట్టుదల, క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించవచ్చనే విషయాన్ని డా. గోపీ కృష్ణ ప్రయాణం నిరూపిస్తోందని పేర్కొన్నారు.





