శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ప్రభుత్వ జనగణన విభాగం మార్గదర్శకాల ప్రకారం స్వీయ గణన (Self Enumeration – SE) ప్రక్రియ ఆదివారం నుంచి మే 10 వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పౌరులు తమ గృహ వివరాలను స్వీయ గణన పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సర్కిల్ డిప్యూటీ కమిషనర్, జనగణన ఇన్‌చార్జి అధికారి సేవా ఏస్లావత్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వీయ గణన పోర్టల్‌లో వివరాలను సమర్పించడం ద్వారా ఈ ముఖ్యమైన ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఈ సౌకర్యం ద్వారా ప్రజలు తమ ఇళ్ల నుండే సులభంగా జనగణన వివరాలను నమోదు చేసుకోవచ్చని, తద్వారా సమయం ఆదా అవుతుందని, సమాచార కచ్చితత్వం మెరుగుపడుతుందని తెలిపారు.

SE పోర్టల్ లింక్ https://se.census.gov.in ను పౌరులు సందర్శించి అందులో స్వీయ గణనలో భాగంగా వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ పోర్టల్ 15 రోజులపాటు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ప్రారంభానికి ముందు వరకు అందుబాటులో ఉంటుందని, పౌరులు ఈ గడువులోపల స్వీయ గణనను పూర్తి చేయాలని సూచించారు. ఈ పోర్టల్‌ను పౌరులుగా చాలా సరళంగా ఉపయోగించవచ్చని, సులభమైన దశల్లో వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు. పోర్టల్‌ను ఓపెన్ చేసిన తరువాత పౌరులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వాలని, తరువాత భాషను ఎంచుకోవాలని, అనంతరం అందులో రాష్ట్రం, జిల్లా, పట్టణం, గ్రామం వివరాలను శోధించి ఎంపిక చేయాలని తెలిపారు. తరువాత మ్యాప్‌లో ఇంటి స్థానాన్ని గుర్తించాలని, గృహ వివరాలను నమోదు చేయాలని, వాటిల్లో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఏమేం సౌకర్యాలు ఉన్నాయి వంటి వివరాలను ఇవ్వాలని అన్నారు. తరువాత సమాచారాన్ని సేవ్ చేసి ఒకసారి చెక్ చేయాలని, అనంతరం ఫామ్‌ను సమర్పించాలని అన్నారు.
స్వీయ గణన పోర్టల్‌లో పౌరులు పలు ప్రాథమిక వివరాలను అందించాలని, కుటుంబ సభ్యుల వివరాలు తెలపడంతోపాటు ఇంటి రకం, స్థితి, నీరు, మరుగుదొడ్డి, విద్యుత్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా, లేదా, ఫోన్‌ల వివరాలు, వాహనం, ఇంటర్నెట్, ఆస్తుల వివరాలు సమర్పించాలని, దీంతో స్వీయ గణన పూర్తయినట్లు పౌరులకు చివర్లో రిఫరెన్స్ ఐడీని నమోదిత మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్ ఇంటి సందర్శన సమయంలో ఆ రిఫరెన్స్ ఐడీని చూపించాలని అన్నారు. దీని వల్ల ప్రజలు ప్రభుత్వానికి కచ్చితమైన, నమ్మకమైన సమాచారం అందించేందుకు వీలవుతుందని తెలిపారు. పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని స్వీయ గణను సరైన సమయానికి పూర్తి చేయాలని కోరారు. కచ్చితమైన, నమ్మకమైన జనగణన డేటా కోసం ప్రజల సహకారం అత్యంత అవసరమని అన్నారు.





