నమస్తే శేరిలింగంపల్లి: ఒక వైపు కరోనా విళయతాండవం చేస్తుంటే మరోవైపు అక్రమార్కులు బాదితుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కష్టకాలంలో తోచిన సహకారం అందించాల్సింది పోయి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా రోగులకు ఉపయోగించే రెమిడెసివిర్ అనే ఇంజిక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తూ ఇద్దరు మియాపూర్ పోలీస్‌లకు పట్టుబడ్డారు. ఇన్‌స్పెక్టర్ సామల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం… మయూరీనగర్‌లో నివాసం ఉండే పాలడుగు సతీష్(37) హోటల్ వ్యాపారి. కొండా జగన్ మోహన్‌రెడ్డి(32) స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఐతే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోగులకు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లు తరచు అవసర పడుతున్న నేపథ్యంలో కృత్రిమ కొరత ఏర్పడింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని డబ్బు సంపాదించుకుందాం అనుకున్న సతీష్, జగన్‌మోహన్‌రెడ్డిలు రెమిడిసివిర్ ఇంజక్షన్‌లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే రూ.1 వేయ్యి లోపు ఉండాల్సిన ఇంజక్షన్‌ను ఏకంగా రూ.28 వేలకు విక్రయించేందుకు రోగుల బంధువులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మియాపూర్‌లో వారిరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను స్వాదీనం చేసుకుని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. రోగులకు న్యాయంగా దక్కాల్సిన మందులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే తగిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్‌హెచ్చరించారు.