- మొరాయిస్తున్న సర్వర్లు.. రోజుకు ఒక్కటే రిజిస్ట్రేషన్
- రిజిస్ట్రేషన్ విధానంలో ఎన్నో సమస్యలు
- పరిష్కారం అయ్యేందుకు సంవత్సరాలు పడుతుంది
- ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలపై రూ.1.20 లక్షల కోట్ల భారం
- తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులను పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి కొత్త పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తుందని తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వర్లు మొరాయిస్తుండడంతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు ఒక్క స్లాట్ మాత్రమే బుక్ అవుతుందని తెలిపారు. దీని వల్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు అయోమయంలో పడిపోయారన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండార్లు రోడ్డున పడనున్నారని అన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు స్టాంపులు అవసరం లేదని, తెల్ల పేపర్ మీదే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదన్నారు. వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో పొడవు, వెడల్పు కొలతలకు అవకాశం లేదన్నారు. సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవడం కూడా కుదరడం లేదన్నారు. రెక్టిఫికేషన్‌కు అవకాశం లేదని తెలిపారు.
ఆస్తి తమ పేరిట ఉన్నవారు మరణిస్తే వారి లీగర్ హయర్స్ పేర్లు రాసుకునేందుకు అవకాశం లేదన్నారు. రోజుకు 24 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తామని చెబుతున్నారని, కానీ గతంలో రోజుకు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు అయ్యేవన్నారు. స్లాట్ లేకున్నా గతంలో సాధారణ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసేవారని, కానీ ఇప్పుడు అలా కుదరడం లేదన్నారు. కొనుగోలు చేసిన వారు ఇష్టం వచ్చినట్లుగా డాక్యుమెంట్లను రాసుకునేందుకు అవకాశం లేదన్నారు.
సాక్షుల పేర్లను ముందే రాయాలని, రిజిస్ట్రేషన్ అయ్యే సమయానికి సాక్షి రాకపోతే రిజిస్ట్రేషన్ అవడం లేదని అన్నారు. ఇలాగే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఎస్పీఏ, జీపీఏ, మార్టిగేజ్, గిఫ్ట్ డీడ్ అవడం లేదన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వారు 29 లక్షల మంది ఉన్నారని, వారు పూర్తిగా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందేనని అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట రూ.1.20 లక్షల కోట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపిందన్నారు. ప్రతి సంవత్సరం ఇంటికి పన్ను కట్టినట్లుగా ఓపెన్ ప్లాట్‌కు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని తెలిపారు.





