శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): మున్నూరు కాపుల జనాభా సంఖ్య తగ్గింపుతో వారి రాజకీయ సామాజిక ప్రయోజనాలను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మున్నూరు కాపు జనాభా లెక్కలను సరిచేయాలని అందుకు రీ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు రాష్ట్ర సంఘం తీర్మానించింది. మున్నూరు కాపు పటేల్ ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించేది లేదని, ప్రతీ పటేల్ చైతన్యమై ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతారని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం, ఆత్మగౌరవ భవన నిర్మాణం, జిల్లా సదస్సుల నిర్వహణ కోసం సమావేశమయ్యారు. సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వారీగా భవిష్యత్తులో చేపట్టబోయే రాష్ట్ర స్థాయి కార్యాచరణ అమలు కోసం ఇంచార్జీల నియామకం చేపట్టారు. శుక్రవారం చందానగర్ లోని సుప్రజా హోటల్లో రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం రావు అధ్యక్షతన జరిగిన 33 జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జిల శిక్షణా శిబిరం సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా లెక్కల సేకరణ కోసం జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలు వెంటనే కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో భవన నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అందుకోసం ప్రతి మున్నూరు కాపును గ్రామస్థాయి నుండి కదిలించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్ మాట్లాడుతూ అన్ని జిల్లాలలో జిల్లా సదస్సులు నిర్వహించి మన లెక్కలు మనమే చేసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించి గెజిట్లో మన లెక్కలు చేర్చుకోవాలని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్, ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు, సంఘం సలహాదారు రమేష్ హజారి మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజలు కులాలుగా గుర్తించబడుతుండడం వల్ల కుల అస్తిత్వమే వ్యక్తుల అస్తిత్వంగా పరిణమించిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి మున్నూరుకాపు వ్యక్తి అందరిలాగానే తమ కుల అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నామన్నారు. అందుకు గ్రామస్థాయి నుండి కుల సమాజాన్ని చైతన్య పరచాలని, బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ ఆశయాలను అనుసరించి సంఘం కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. జనాభా సంఖ్య తగ్గడానికి మున్నూరు కాపులకు పేరు చివరన గుర్తింపు లేకపోవడం కూడా ఒక కారణమని వివరించిన హజారి, రావు, రెడ్డి, యాదవ్, గౌడ్ మాదిరి తమ కుల వృత్తిని గౌరవాన్ని తెలిపే పటేల్ పేరును చేర్చుకోవాలని, ఇందులో భాగంగా, పది లక్షల మందితో పటేల్ నామకరణ మహా సభను భారీ ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు గాలి అనిల్ కుమార్, సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్, తోడి ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కోశాధికారి సత్యనారాయణ, రాష్ట్రస్థాయి కీలక నేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లాల ఇన్చార్జిలు, ప్రముఖులు ధర్మపురి సంజయ్, మీసాల చంద్రయ్, బుక్క వేణుగోపాల్, మామిళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.





