శేరిలింగంపల్లి, డిసెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో RBR COMPLEX 4th block, లింగంపల్లి బాపునగర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయి. నేటి యువతరం కూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీలలో 75 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాళ్ళు కస్తూరి , తన్వీర్ బేగం, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి , శివరామకృష్ణ , చంద్రశేఖర్ , రమ్య తదితరులు పాల్గొన్నారు.






