సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ కార్యక్రమానికి చెందిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో అలాంటి 11 కేసులను నమోదు చేసి 54 మందిని అరెస్టు చేయడం జరిగిందని, 23 మంది మహిళలు, చిన్నారులను రక్షించాలమని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రత్యేక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని సహాయంతో అధికారులు బాధితులకు సత్వరమే రక్షణ అందిస్తారని, నిందితులను వెంటనే అరెస్టు చేయడం జరుగుతుందని, ఈ కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌చార్జి ఆఫీసర్, ఏసీపీ కె.నరహరి, సైబరాబాద్ వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సి.అనసూయ, మేడ్చల్ సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ ఏఎం రాజారెడ్డి, రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ కె.నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీఆర్‌డీవో పీడీ పి.ప్రభాకర్, బచ్‌పన్ బచావో ఆందోళన్ కో ఆర్డినేటర్ ఎ.వెంకటేశ్వర్లు, ప్రజ్వల హోమ్ డైరెక్టర్ సునీతా కృష్ణన్, మేడ్చల్ డీఎంహెచ్‌వో డాక్టర్ కె.మల్లికార్జున్, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, చేవెళ్ల ఆర్‌డీవో వేణుమాధవరావు, మేడ్చల్ డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, రంగారెడ్డి జిల్లా డీడబ్ల్యూవో ఎం.మోతి, అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.