హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లోనూ ప్రజల కోసం ఆప్‌కే సాథ్ (మీతో) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి, అధిక వడ్డీతో డబ్బును పొదుపు చేసుకోవాలనుకునేవారి కోసం ఈ కార్యక్రమం కింద పలు స్కీంలలో అధిక వడ్డీని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలు సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, ఎస్‌సీఎస్‌ఎస్, ఎస్ఎస్‌ఏ వంటి పథకాల్లో డబ్బును పొదుపు చేసుకోవచ్చని అన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో 7.6 శాతం, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌లో 7.4 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో 7.1 శాతం వడ్డీలను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో డబ్బులు పొదుపు చేసుకుని అధిక వడ్డీలను పొందవచ్చన్నారు. ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.